మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. నోటీసులు పంపిన మైనింగ్ అధికారులు..!

Sunday, October 11th, 2020, 03:00:46 AM IST


టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. అయితే జేసీకి సంబంధించిన మైనింగ్ సంస్థలలో అక్రమాలు గుర్తించిన మైనింగ్ అధికారులు జేసీ కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని, మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదన్న అధికారులు, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే గత కొద్ది రోజులుగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయని జేసీ దివాకర్ రెడ్డి నిన్న తాడిపత్రిలో హల్‌చల్ చేశారు. నిన్న తాడిపత్రిలోని గనులు, భూగర్భ కార్యాలయానికి చేరుకున్న జేసీ దివాకర్ రెడ్డి తన మైనింగ్ సంస్థలకు పర్మిట్లు ఇవ్వాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని, నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని హెచ్చరించాడు.