బండి సంజయ్‌కి ఫోన్ చేసిన అమిత్‌షా.. సమిష్టిగా పోరాడారంటూ కితాబు..!

Tuesday, November 10th, 2020, 05:58:02 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపొందడంపై అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులంతా సమష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు బండి సంజయ్‌కి మరియు రఘునందన్ రావుకు అభినందనలు తెలియచేశారు.

ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి నేటి ఫలితం దాకా టీఆర్ఎస్‌కు ధీటుగా పోటీ ఇస్తూ వస్తున్న బీజేపీ ఎట్టకేలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో తమ కాషాయ జెండాను ఎగరవేసింది. దుబ్బాక విజయంతో తమలో మరింత ఆత్మవిశ్వాసం నెలకొందని 2023 ఎన్నికలలో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నికలో ఓడిపోని టీఆర్ఎస్‌కు దుబ్బాక ఫలితం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.