రివ్యూ రాజా తీన్‌మార్ : అమీ తుమీ – సినిమా మొత్తం శ్రీ చిలిపి చేష్టలే

Saturday, June 10th, 2017, 08:05:47 AM IST

తెరపై కనిపించిన వారు:  అడివి శేష్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బ, అదితి మ్యాకల్

కెప్టెన్ ఆఫ్ ‘అమీ తుమీ’ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

మూల కథ :

కోటీశ్వరుడైన ఫైనాన్షియర్ (తనికెళ్ళ భరణి) కొడుకు విజయ్ (శ్రీనివాస్ అవసరాల) వ్యాపారంలో అతన్ని మోసం చేసిన మరొక వ్యక్తి కూతురు మాయ (అదితి మ్యాకల్) ను ప్రేమిస్తాడు. అలాగే కూతురు దీపిక (ఈషా రెబ్బ) కూడా అనంత్ (అడివి శేష్) అనే పెద్దగా డబ్బులేని అబ్బాయిని ప్రేమిస్తుంది. దీంతో భరణి వాళ్ళ ప్రేమ పెళ్ళికి నో చెప్పి దీపికకు శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్) తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు.

దీంతో ఈ రెండు ప్రేమ జంటలు కోరుకున్న వారినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. అందులో భాగంగా కాస్త గడుసు అమ్మాయి అయిన దీపిక పని మనిషితో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటి ? దాన్ని ఎలా వర్కవుట్ చేశారు ? చివరికి శ్రీ చిలిపి అతని జీవితం ఏ గమ్యం చేరింది ? అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

–> సినిమా మొత్తాన్ని తన భుజాలపై తన భుజాలపైనే వేసుకుని నడిపించిన వెన్నెల కిశోర్ కి మొదటి విజిల్ వేసుకోవచ్చు. కథా పరంగా పాత్ర ప్రాముఖ్యతను గుర్తించిన వెన్నెల కిశోర్ పూర్తి స్థాయిలో దానికి న్యాయం చేశాడు. కనిపించిన ప్రతి సన్నివేశంలోను హాస్యాన్ని వెదజల్లాడు. ఒకరకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేశాడనోచ్చు.

–> అలాగే పని మనిషి కుమారి పాత్రలో నటించిన శ్యామలా దేవి కూడా వెన్నెల కిశోర్ తో కలిసి పోటా పోటీగా నటించి ఆకట్టుకుంది. కనుక ఆమెకు రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక రొటీన్ పాయింట్ ను తీసుకుని దానికి ఎక్కడా ఆగకుండా సరదగా సాగిపోయే హాస్యపూరితమైన కథనాన్ని రాసుకుని అనవసరకమైన పాటల్ని, ఇతర కమర్షియల్ అంశాల్ని పక్కనబెట్టి సినిమాను ఎంటర్టైనింగా తయారు చేశారు. కనుక మూడో విజిల్ ఆయనకు వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల తండ్రిగా నటించిన తనికెళ్ళ భరణి పాత్ర బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆయన కాస్త ఎక్కువగా చేస్తున్నట్టు అనిపించి ఇబ్బంది కలిగింది.

–> అలాగే వెన్నెల కిశోర్ అసిస్టెంట్ పాత్ర కూడా పెద్దగా అవసరంలేని కొన్ని సన్నివేశలలో, సందర్భాల్లో బలవంతంగా వస్తూ డిస్టర్బ్ చేసింది.

–> కథలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోవడంతో పాటు ప్రేమ్ జంటల మధ్య అస్సలు రొమాన్స్ లేకపోవడం కూడా బి, సి సెంటర్లను నిరుత్సాహపరిచే అంశం.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ కామెడీ ఎంటర్టైనర్ సాధారణమైన పాత్రలు, పరిస్థితుల మధ్య నడిచేది కాబట్టి ఎక్కడా వింతగా తోచే అంశాలు కనిపించలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: వెన్నెల కిశోర్ భలేగా చేశాడు కదా !
మిస్టర్ బి: భలేగా ఏంటి వన్ మ్యాన్ షో చేశాడు.
మిస్టర్ ఏ: అవునవును సినిమా మొత్తం శ్రీ చిలిపి చేష్టలే.