మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?

Thursday, January 28th, 2021, 06:52:56 PM IST

Ambati_Rambabu

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోయింది అని, అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఉన్నారు అంటూ అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి రాలేదు అనే దిగులు చంద్రబాబు లో ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ స్ఫూర్తి తో పని చేయడం లేదు అని విమర్శించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు స్ఫూర్తి తో పని చేస్తున్నారు అని, టీడీపీ పని అయిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా అంటూ అంబటి రాంబాబు అటు టీడీపీ కి, ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కి సూటిగా ప్రశ్నించారు. గతంలో ఏకగ్రీవ గ్రామాలకి ప్రోత్సాహకాలు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. అయితే ఏకగ్రీవ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలి అని, ప్రజాస్వామ్యంలో లక్ష్మణ రేఖ దాటితే మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి అత్యంత దురదృష్ట కరం అని, పంచాయతి లలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే పార్టీల ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది అని, ఇలాంటి సమయం లో టీడీపీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు పచ్చ కాగితం విడుదల చేశారు అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా, వీటి పై ఎన్నికల కమిషనర్ ఏం చర్యలు తీసుకుంటారు అంటూ అంబటి రాంబాబు వరుస ప్రశ్నలు వేశారు.