ప్రధాని మోదీకి రాజధాని రైతుల బహిరంగ లేఖ.. ఏం కోరారంటే?

Tuesday, September 15th, 2020, 12:07:11 AM IST


ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరవధిక నిరసనలు తెలుపుతున్నా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాజధాని రైతులను రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర వేధింపులకు గురిచేస్తుందని దీనిని ఆపేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు రాజధాని అమరావతిని కాపాడేలా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని లేఖలో విజ్ణప్తి చేశారు.

అయితే ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట రాజధాని రైతులపై పెద్ద కుట్రకు పాల్పడుతుందని, కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నా సిట్, సీఐడి, సబ్ కమిటీ పేర్లతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆనాడు రైతులతో చేసుకున్న న్యాయబద్ధ ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. పేద రైతుల పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం జరిపిన భూ విక్రయాలను కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ నిందలు వేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో పెద్దఎత్తున వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని, ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై అవినీతి ముద్ర వేస్తున్నారని అన్నారు.