ఆ నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం – మంత్రి ఆళ్ళ నాని!

Sunday, August 9th, 2020, 11:00:37 PM IST

విజయవాడ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి కరోనా కేర్ సెంటర్ లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం లో పదిమంది మరణించినట్లు మంత్రి ఆళ్ళ నాని మీడియా సమావేశం లో వెల్లడించారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన లో అగ్నిమాపక సిబ్బంది సత్వర స్పందన ద్వారా చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నారు అని అన్నారు. అయితే ఈ ఘటన పై మంత్రి ఆళ్ళ నాని సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా కేర్ సెంటర్ లో 31 మంది చికిత్స పొందుతుండగా, అందులో 10 మంది ప్రాణాలను కోల్పోయారు అని, మిగతా 21 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రమాద ఘటన పై సమీక్ష నిర్వహించినట్లు తెలుపుతూ ఆ ఆసుపత్రి కి అనుమతులు ఉన్నాయా లేదో అని పరిశీలిస్తున్న విషయాన్ని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ లేదా మరే కారణాలు ఉన్నాయా, లేదంటే యాజమాన్య నిర్లక్ష్యమా అంటూ తెలిపారు. ఒక వేళ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. 48 గంటల్లో పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని, నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు.