నేటిఎపి స్పెషల్ : పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు..!

Friday, May 16th, 2014, 12:53:15 PM IST


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పదేళ్ల తర్వాత తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సీమాంధ్ర ఫలితం ఖరారైనట్టే. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. టీడీపీ 105 పైగా సీట్లలో భారీ ఆధిపత్యం సాధించి అధికారం ఖరారు చేసుకుంది. ఉదయం నుంచి టీడీపీకి పోటి ఇస్తున్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆధిక్యం క్రమేపి తగ్గిపోయింది. టిడిపి 105 సీట్లకు చేరుకోగా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ 63 కి పడిపోయింది.

సీమాంధ్రలో గెలుపు ఖాయమవ్వడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు సందడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేలుళ్లు, మేళతాళాల హోరుతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ కూటమికి కృషి చేసినందుకు వారిద్దరూ పవన్ కల్యాణ్ ను అభినందించారు. దేశంలో, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, సుపరిపాలని అందిస్తామని వారు తెలిపారు.