ఏపీ ప్రభుత్వం నన్ను వేధిస్తుంది.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు..!

Tuesday, January 5th, 2021, 04:25:18 PM IST

ఏపీ ప్రభుత్వంపై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఏబీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. నాపై క్రిమినల్ కేసుపెట్టి త్వరలోనే జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్లీ నాపై సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. దీనిపై తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు.

ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసినప్పుడు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ని ఆశ్రయించిన క్యాట్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్దిస్తూ ప్రభుత్వానికే మద్ధతు తెలిపింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ను ఎత్తేసింది. అంతేకాదు ఏబీనీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై స్టే విధించింది.