జీహెచ్ఎంసీలో ఉచిత తాగు నీటి పథకానికి ఆధార్ తప్పనిసరి..!

Saturday, December 12th, 2020, 07:32:02 AM IST

గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నుంచి గ్రేటర్ వాసులకు ఉచిత తాగునీరు అందజేస్తామని ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. అయితే తాజాగా ఉచిత తాగునీటి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబర్ చివరి నుంచి కానీ, వచ్చే నెలలో కానీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉచిత తాగునీరు పొందాలనుకునేవారికి ఆధార్ లేకుంటే వెంటనే ఆప్లై చేసి, ఆ రశీదును అధికారులకు చూపించాల్సి ఉంటుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియ అలస్యమైతే పోస్టాఫీసు పాస్‌బుక్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదైనా ఒకటి సమర్పించాలని చెప్పుకొచ్చారు.