బిగ్ న్యూస్: భారత్ లో 70 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య!

Sunday, October 11th, 2020, 12:15:40 PM IST

భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 74,383 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 70,53,807 కి చేరింది. ఈ కేసుల సంఖ్య రోజురోజుకీ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 918 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,08,334 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు (86.17) కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి.

గడిచిన 24 గంటల్లో 89,154 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 60,77,976 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 8,67,496 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.