న్యాయవాద దంపతుల హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్..!

Saturday, February 20th, 2021, 02:07:57 AM IST


పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులైన కుంట శ్రీనివాస్, చిరంజీవి, అప్పాల కుమార్‌‌లను పోలీసులు మంథని కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ1గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్‌, ఏ2గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్‌లు ఉన్నారు. నిందితులపై ఐపీసీ 302, 341, 120బి రెండ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

అంతకు ముందు వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులైన కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌ను పోలీసులు హత్య జరిగిన స్పాట్‌ వద్దకు తీసుకెళ్ళారు. హత్య ప్లాన్ దగ్గర నుంచి హత్య చేసే వరకు మొత్తం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.