బిగ్ రికార్డ్: కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..!

Wednesday, May 12th, 2021, 11:35:03 PM IST


కరోనా సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు యువకులు కూడా మరణిస్తున్న ఇలాంటి సమయంలో ఓ కుర వృద్ధుడు కరోనాను జయించి అందరిని ఆశ్చర్యపరిచాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రామానంద తీర్థ అనే 110 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు.

అయితే దేశంలోనే అత్యధిక వయసున్న కరోనా బాధితుడు కోలుకోవడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థకు ఇటీవల స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఏప్రిల్ 24న ఆయన గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటి నుంచి ఐసీయూ వార్డులో ఆయనకు వైద్యులు చికిత్స ఇస్తూ వచ్చారు. దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత రామానంద కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయనకు మరోసారి పరీక్షలు చేయగా రిపోర్టుల్లో నెగెటివ్ అని వచ్చింది. అయితే ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వలనే రామానంద తీర్ధ ఈ వయసులో కూడా కరోనా నుంచి కోలుకున్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పుకొచ్చారు.