ఓటీటీలపై కేంద్రం విధించిన నియమ నిబంధనలను స్వాగతిస్తున్నాను – విజయశాంతి

Friday, February 26th, 2021, 01:19:57 AM IST

Vijay shanthi

ఓటీటీ ప్లాట్‌ఫాం, సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను తీసుకువచ్చింది. అయితే దీనిపై స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి ఒక దారి, తెన్ను.. సరైన విధి విధానాలు లేకుండా సాగుతున్న సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫాం కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ పేరిట విద్వేషాన్ని రగిల్చే రాతలు, వీడియోలు ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోయాయని అన్నారు.

అయితే వీటి కారణంగా ఎందరో వ్యక్తులు, కుటుంబాలు వేదనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. నియంత్రణలేని సోషల్ మీడియా, ఓటీటీ తదితర కంటెంట్ వల్ల పలు సందర్భాల్లో వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడటమే గాక, ఒక్కోసారి అది దేశ ఐక్యతకు సైతం ముప్పుగా మారుతోందని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిల సంఖ్య పెరిగిపోయిందని ఈ విషయమై గతంలో నేను పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాను. ఇలాంటి పరిస్థితులను కఠినంగా నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు అన్ని వర్గాలకూ శ్రేయస్కరమని నేను నమ్ముతున్నానని విజయశాంతి అన్నారు.