చిరు 150వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం..?

Sunday, November 22nd, 2015, 07:31:18 PM IST

Trivikram-Srinivas-chiru
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎవరితో చేస్తారన్నది ఇంతవరకూ ఫిక్సవ్వలేదు. కొన్ని రోజులు చిరు 150వ సినిమాను పూరీ డైరెక్ట్ చేస్తున్నాడని..దానికి చరణ్ నిర్మాత అని ఓ ఘట్టం నడిచింది. కానీ చిరుకు పూరీ చెప్పిన కధ సగం నచ్చకపోవటంతో ఆ సినిమా ఆగిపోయింది. అప్పటి నుండి ఒక్కొకరు ఒక్కో దర్శకుడి పేరు చెబుతూ వాళ్ళే చిరు 150వ సినిమాని డైరెక్ట్ చేసేది అని రకరకాల కధలు అల్లారు. కానీ ఇప్పుడు తాజాగా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.

అతనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పటికే త్రివిక్రమ్ చిరంజీవికి కధ కూడా చెప్పినట్టు త్వరలోనే సినిమా మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకి కధను అందించింది త్రివిక్రమే. ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న అ..ఆ సినిమా షూటింగ్ లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. దీని తరువాత వీరిద్దరి సినిమా ఉంటుందని వినికిడి. కానీ ఇప్పటివరకూ అటు చిరంజీవి నుంచిగానీ, ఇటు త్రివిక్రమ్ నుంచిగానీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.