పవన్ బర్త్‌డే స్పెషల్.. అభిమానులకు డబుల్ ధమాక..!

Tuesday, September 1st, 2020, 01:23:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల గ్యాప్ తరువాత పవన్ బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు మరియు బోణీ కపూర్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటుదని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. ఈ సినిమాకి సంబంధించి రేపు ఉద‌యం 9 గం.ల 9 నిమిషాల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత‌లు బోని క‌పూర్, దిల్ రాజు ఆఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 28 వ చిత్రానికి సంబంధించి కూడా రేపు ఓ అప్డేట్ రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించే చిత్రానికి సంబంధించి సెప్టెంబర్ 02 సాయంత్రం 4 గం.ల 5 నిమిషాలకు ఓ అప్డేట్ ఉంటుందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిన్న ఆఫీషియల్‌గా వెల్లడించింది. అయితే పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా డబుల్ ధమాక అనే చెప్పాలి.