ఆ కండీషన్స్ ఒప్పుకోకపోతే మార్చ్ 1 నుంచి థియేటర్లు బంద్..!

Thursday, February 4th, 2021, 02:14:23 AM IST


కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాలలో సినీ రంగం కూడా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడం, షూటింగ్‌లు పూర్తి చేసుకుని చాలా సినిమాలు విడుదలకు సిద్దమవుతున్న సమయంలో నిర్మాతలకు, థియేటర్ల ఓనర్లకు మధ్య మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. నేడు రామానాయుడు స్టూడియోలో తెలంగాణ సినిమా థియేటర్ల యజమానులు, నిర్మాతల సమావేశం జరిగింది.

అయితే ఈ సమావేశంలో థియేటర్ల ఓనర్లు పలు డిమాండ్లను చెప్పుకొచ్చారు. మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరిగానే సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఇక ఓటీటీ విడుదల విషయంలో కూడా ఓ కండీషన్ పెట్టారు. థియేటర్లలో సినిమా విడుదలకు ఓటీటీలో విడుదలకు మధ్య పెద్ద సినిమాలకు 6 వారాలు, చిన్న సినిమాలకు 4 వారాల గ్యాప్ ఉండాలని అప్పుడే మంచి థియేట్రికల్ రన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే తమ కండీషన్లకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమా హాళ్లు నడుస్తాయని లేదంటే మార్చ్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని థియేటర్ల ఓనర్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ డిమాండ్లపై నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.