ప్రకృతిపై మహేష్ అద్భుతమైన కామెంట్స్.!

Sunday, August 9th, 2020, 08:23:18 PM IST

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు ఓపక్క సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. అలాగే మరోపక్క సినీ అగ్ర తారలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ మహేష్ మాత్రం ఈ పుట్టినరోజు వేడుకలను చాలా ప్రశాంతంగా సింపుల్ గా చేసుకుంటున్నారు. అలా ఈ పుట్టిన రోజు నాడు ఒక మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ..

“ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో.. మొక్కలకి, జంతువులకి అంతే ఉంది. అన్ని జీవ జాలాన్ని సమానంగా చూడటమే నాగరికత అన్నారు పెద్దలు, కానీ మనం మాత్రం బంగళాలు కట్టడం, అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేసే ఎరువుల్ని వాడి అభివృద్ధి, నాగరికత అనుకుంటుంన్నాం. అందుకే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా.

అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనాలాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం. ఇది జరగాలంటే ప్రతీ ఒక్కరు మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలి, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలి. ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా” అని.

అలాగే దీనిని “ఛాలెంజ్ అనేకంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నాదీ, నీది అని కుచించుకుపోయిన సమాజంలో ఇంత ఉదాత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందిని కదిలించడం అంటే మాములు విషయం కాదు.

అందుకు సంతోష్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నా.. వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతూ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఇళయ తలపతి విజయ్ కు అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మహేష్ విసిరారు.