పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై మరో క్రేజీ అప్‌డేట్..!

Friday, January 15th, 2021, 11:33:35 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న పింక్ రీమేక్‌ వకీల్ సాబ్ సినిమాను కంప్లీట్ చేశాడు. నిన్న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా, ముందుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమా పట్టాలెక్కబోతుంది.

అయితే మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను సాగర్ కె చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌‌ వచ్చింది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే‌తో పాటు మాటలు కూడా అందించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా, రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.