భీష్మ సినిమా టైటిల్ వివాదం.. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..!

Tuesday, February 25th, 2020, 01:39:27 AM IST

నితీన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తాజాగా తెర్కెక్కించిన చిత్రం భీష్మ. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 21వ తేదిన విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ని సంపాదించుకుని కలెక్షన్ల పరంగా మంచి వసూళ్ళను రాబడుతుంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై సినిమా విడుదల కాకముందు నుంచే వివాదం మొదలయ్యింది.

అయితే తాజాగా సినిమా టైటిల్‌పై పోలీస్ కేసు నమోదయ్యింది. సినిమా టైటిల్ తమకు అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సినిమాలో హీరో అమ్మాయిల వెంటపడే లవర్ బాయ్‌ లాంటి పాత్రకు భీష్మాచార్యుడి పేరును ఎలా పెడతారని సంఘం ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సినిమాలోని డైలాగులు, చిత్ర టైటిల్ తమను అవమానించేలా ఉన్నాయని చిత్ర యూనిట్‌పై మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా టైటిల్ ఉందని అందుకే దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, రచయిత, నటుడు నితిన్, సితార ఎంటర్‌ప్రైజెస్, పీడీపీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నూలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.