కొరటాల శివ చిత్రం లో ఎన్టీఆర్ లుక్ అదుర్స్!

Thursday, May 20th, 2021, 09:30:14 AM IST

కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. NTR30 పేరుతో విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ క్లాస్ లుక్ తో చాలా పవర్ ఫుల్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొదటగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన కొరటాల శివ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరొక హీరో గా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అయితే కొరటాల శివ సైతం ప్రస్తుతం ఆచార్య చిత్రం కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమా లు చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు పూర్తి అయిన అనంతరం ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.