తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్.. షూటింగ్‌లపై కూడా కీలక నిర్ణయం..!

Tuesday, April 20th, 2021, 09:00:40 PM IST

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో కరోనా 2.0 ఉదృత్తి కొనసాగుతున్న నేపధ్యంలో థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు రేపటి నుంచి మూతబడనున్నాయి. కాగా ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసి‍యేషన్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలు, దర్శకులు నేడు సమావేశమై అత్యవసరమైతే తప్ప సినిమా చిత్రీకరణలు చేయకూడదని నిర్ణయించారు. కేవలం 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుగు చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ చెప్పుకొచ్చారు.