షాకింగ్ : లెజెండరీ గాయకులు ఎస్పీ బాలు గారికి కరోనా పాజిటివ్.!

Wednesday, August 5th, 2020, 02:09:04 PM IST

ప్రస్తుతం కరోనా వైరస్ అక్కడా ఇక్కడా అని లేకుండా మన దేశంలో భారీ ఎత్తున వ్యాప్తి చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని వ్యాప్తి మొదట్లో సామాన్య జనం నుంచి తర్వాత సినిమా తారలు సహా రాజకీయ నాయకుల వరకు కూడా వచ్చేసింది. మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పొలిటీషియన్స్ మరియు సినిమా నటులకు కరోనా పాజిటివ్ రావడం ఆ రంగాల అభిమానులను విస్మయపరిచింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మన దేశంలోనే లెజెండరీ గాయకులు అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రేక్షకులతో పంచుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని జలుబు వస్తూ పోతుండడంతో ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చెయ్యగా పాజిటివ్ వచ్చింది అని ఆయన తెలిపారు.

అలాగే వైద్యులు అప్పుడు తనని హోమ్ క్వారంటైన్ లో ఉండమన్నారని కానీ తన కుటుంబ సభ్యుల పరిస్థితి రీత్యా తాను ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. అలాగే తాను ఇప్పుడు బాగానే ఉన్నానని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన ముందుగానే చెప్పేసారు. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని హాస్పిటల్ లో కూడా చాలా బాగా చూసుకుంటున్నారని ఆయన వీడియో పెట్టి తెలిపారు.