హాట్ టాపిక్: దసరా కి ల్యాండ్ అవ్వనున్న కొమరం భీమ్!?

Sunday, October 4th, 2020, 10:00:16 PM IST

బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచ స్థాయి మార్కెట్ ను సొంతం చేసుకున్న జక్కన్న, రౌద్రం రణం రుధిరం చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో పాటుగా, రామ్ చరణ్ టీజర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కొమరం భీమ్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే జక్కన్న త్వరలోనే మరొక వీడియో విడుదల చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే RRR చిత్రం 70 శాతానికి పైగా పూర్తి కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ పొడిగింపు తో షూటింగ్ వాయిదా పడింది. అయితే త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ విడుదల ఉంటుంది అని సమాచారం. అయితే ఈ సారి రాజమౌళి అభిమానులను నిరాశ పరచకుండా పక్కగా కొమరం భీమ్ ను ఈ దసరా కి ల్యాండ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దసరా కి ఎన్టీఆర్ అభిమానులకి డబుల్ ఫెస్టివల్ అని చెప్పాలి.