దయచేసి రావద్దు.. అభిమానులకు బాలకృష్ణ విజ్ఞప్తి..!

Tuesday, June 8th, 2021, 01:23:57 AM IST

నందమూరి బాలకృష్ణ ఈ నెల 10వ తేదిన 61వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. బాలయ్య బాబు జన్మదినాన అభిమానులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. ఇంటికి వెళ్ళి ఆయన చేత్తో మొట్టికాయలు తింటూనే విషెష్ చెప్పి వస్తుంటారు. అయితే ప్రస్తుతం క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ ఎవరూ రావొద్దంటూ బాలయ్య బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

నా ప్రాణ సమానులైన అభిమానులకు విజ్ఞ‌ప్తి అంటూ జూన్ 10న నా పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తోన్న‌ ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానమే. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేనని, మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదని, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదని, మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానుల‌కు, కార్యకర్తలకు, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నానని చెప్పుకొచ్చాడు.