థియేటర్స్‌ ఆక్యుపెన్సీ పెంపుపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్..!

Thursday, January 28th, 2021, 01:00:40 AM IST

దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తుండడం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో వసూళ్లు రాబట్టడం కష్టమని భావించి చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. అయితే సంక్రాంతికి కొన్ని సినిమాలు ధైర్యం చేసి ముందుకు రావడంతో ప్రేక్షకులను థియేటర్స్ వైపు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి.

అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ గతంలో కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్స్‌, మల్టీప్లెక్స్‌లలో అనుమతించేలా తాజాగా కేంద్రం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఎంత ఆక్యుపెన్సీ అనేది త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది. ఇక స్విమ్మింగ్ పూల్స్‌కు కూడా పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉండగా ఇకపై ఎవరైనా వెళ్ళొచ్చు.