రివ్యూ రాజా తీన్‌మార్ : అర్జున్ రెడ్డి – యువత వరకు బాగా నచ్చుతాడు


తెరపై కనిపించిన వారు: విజయ్ దేవరకొండ, షాలిని

కెప్టెన్ ఆఫ్ ‘అర్జున్ రెడ్డి’ : సందీప్ రెడ్డి వంగ

మూల కథ :
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, విపరీతమైన స్వాతంత్ర్య వ్యక్తిత్వం కలిగిన మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ లో తన జూనియర్ ప్రీతి శెట్టి (షాలిని పాండే) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. అలా ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరైన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

కానీ ప్రీతి తండ్రి మాత్రం వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు. దాంతో మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ రెడ్డిని చెడు అలవాట్లకు బానిసై కుంగిపోతుంటాడు. పైగా డాక్టర్ వృత్తిని కూడా కోల్పోతాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అర్జున్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి ? అతని ప్రవర్తన ఎలా ఉండేది ? చివరికి అతని స్వచ్ఛమైన ప్రేమ గెలిచిందా లేదా ? అనేదే కథ.

విజిల్ పోడు :
–> దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మెచ్యూర్డ్ పెర్సన్ యొక్క స్వచ్ఛమైన ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుంది, అది దక్కకపోతే అతనెలా కుంగిపోతాడు, అతని మనస్తత్వం ఎలా ఉంటుంది అనేదే అంశాలను చాలా బలంగా చూపించాడు. కనుక దర్శకుడికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక హీరో విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డి పాత్రలో నటించడంకాదు ఏకంగా జీవించాడు అనాలి. దర్శకుడు రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని స్క్రీన్ మీద ప్రభావంతంగా పండేలా చేశాడు విజయ్. కనుక అతనికి రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక ఫస్టాఫ్ కథనం మొత్తం ఆసక్తికరంగా సాగగా సెకండాఫ్ కూడా చాలా వరకు బాగానే ఉంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలైతే కొన్ని రోజులపాటు గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. అలాగే హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన రాహుల్ రామకృష్ణ కామెడీ కూడా బాగుంది. వీటికి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమా సెకండాఫ్ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. హీరోలో డిప్రెషన్ ను మరీ ఎక్కువగా ప్రాజెక్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది.

–> ఇక హీరోయిన్ తనను మొదటి చూపులోనే ప్రేమించిన హీరోని ఎందుకు ఇష్టపడుతుంది, ఎప్పుడు ఇష్టపడుతుంది అనే అంశాలని క్లారిటీగా చూపలేదు.

–> పైగా సినిమా అంతా డార్క్ మూడ్లో నడిచి చివరికి హ్యాపీ ఎండింగ్ అవడం కూడా డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ కలిగించింది.

–> అలాగే హీరోయిన్ ఒక పక్కన హీరో నాశనమైపోతున్నా కొన్ని ముఖ్యమైన విషయాల్ని దాచిపెట్టి హీరోకి దూరంగా ఉండటం కూడా కొంత నాటకీయంగా అనిపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో మరీ వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా కొత్తగా బాగుంది కదా !
మిస్టర్ బి : అవును నాకైతే బాగా నచ్చింది.
మిస్టర్ ఏ: మనకే కాదు మన యూత్ మొత్తానికి నచ్చే సినిమా ఇది.