బిగ్‌బాస్: గంగవ్వ ఫాలోయింగ్‌కి భయపడుతున్న మిగతా సభ్యులు..!

Tuesday, September 8th, 2020, 01:40:57 PM IST

gangavva

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 4 అప్పుడే చాలా ఆసక్తిగా మారిపోయింది. నిన్న మొదటి రోజు కావడంతో హౌస్‌లో సందడి సందడి కనిపించింది. కరాటే కళ్యాణి అనవసర విషయానికి రాద్ధాంతం చేస్తే సుజాత కన్నీరు పెట్టుకుంది. మోనాల్ ఎమోషన్స్ చూపించగా, మహబూబ్ అమ్మా, నాన్నలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు. ఇక హౌస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న గంగవ్వతో సభ్యులంతా చక్కగా నడుచుకుంటున్నారు. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న ఆరియానా గ్లోరీ, సోహిల్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే మొదటి వారం ఎలిమినేషన్ ఉండదని అనుకున్నా నామినేషన్ ప్రక్రియ మొదటి రోజే పూర్తి చేసి సభ్యులందరికి ఒకింత షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. 14 మంది సభ్యులను ఇద్దరుగా కనెక్ట్ చేసి వారిలో మిగిలిన సభ్యులు ఒక్కోరిని నామినేట్ చేయాలని చెప్పాడు. ముందుగా అభిజిత్, హారిక నామినేషన్‌లో నిలబడగా మిగతా సభ్యులంతా కలిసి అభిజిత్‌ని నామినేట్ చేశారు. రెండో జంటగా సూర్యకిరణ్, దేవి నాగవల్లి నిలబడగా సూర్యకిరణ్‌ను, మూడో జంటగా అఖిల్, కల్యాణి నిలబడగా అఖిల్‌ను, నాలుగో జంటగా దివి, అమ్మ రాజశేఖర్ నిలబడగా దివిని, ఐదో జంటగా లాస్య, మహబూబ్ నిలబడగా మహబూబ్‌ని, ఆరో జంటగా సుజాత, మోనాల్ నిలబడగా సుజాతను, చివరగా గంగవ్వ, నోయల్ నిలబడగా ఒక్క హారిక తప్ప మిగతా సభ్యులంతా గంగవ్వను నామినేట్ చేశారు. అయితే మొదటి వారం నామినేషన్స్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్, దివి, మహబూబ్, సుజాత, గంగవ్వ నిలిచారు.

అయితే యూట్యూబ్ నుంచి స్టార్‌గా మారిన గంగవ్వ బయట చాలా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. హౌస్‌లోకి అడుగుపెట్టిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో గంగవ్వ పేరుతో ఆమె అభిమానులు ఆర్మీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మిగతా సభ్యులకన్నా బలమైన కంటెస్టెంట్‌గా కనిపిస్తున్న గంగవ్వను ముందే నామినేట్ చేసి బయటకు పంపించాలని హౌస్‌లోని మిగతా సభ్యులంతా ఈ విషయంలో ఒకే తాటిపై ఉన్నట్టు అర్ధమవుతుంది. అందుకే కలిసికట్టుగా అవ్వ పేరును మొదటి రోజే నామినేట్ లిస్ట్‌లో చేర్పించారు.