కోర్టులో స్పృహ తప్పిన ప్రముఖ నటి!

Friday, March 6th, 2015, 11:40:37 AM IST

saritha
తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించి కీర్తి గడించిన ప్రముఖ సీనియర్ నటి సరిత కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టులో స్పృహ తప్పి పడిపోయారు. వివరాల్లోకి వెళితే సరిత గతంలో మలయాళ నటుడు ముఖేష్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వీరికి ఇద్దరు కుమారులు కలిగారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2009లో విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం రెండేళ్ళ తర్వాత కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

కాగా అటు తర్వాత ముఖేష్ మిధుల అనే ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే కోర్టులో తమకు విడాకులు మంజూరు చేసినప్పుడు తాను లేనని, ఆ సమయంలో దుబాయ్ లో ఉన్నానని, కోర్టుకు తాను హాజరు కానందు వల్లే చెన్నై కోర్టు విడాకులు మంజూరు చేసిందని, కావున ముఖేష్ రెండో వివాహం చెల్లదంటూ సరిత కొచ్చి కుటుంబ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటీషన్ విచారణ నేపధ్యంగా కోర్టుకు హాజరైన సరిత విచారణ అనంతరం బోను నుండి బయటకు వస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. కాగా ఆమె సన్నిహితులు సపర్యలు చేసి సరితకు స్పృహ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళారు.