పవన్ కు తోడుగా మెగా హీరోలు ఎన్నికల ప్రచారంలోకి దిగుతారా..?

Wednesday, April 13th, 2016, 08:21:00 AM IST


తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబాల్లో మొదటి వరుసన నిలబడేది మెగా కుటుంబం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి నిన్న మొన్న హీరోగా మారిన వరుణ్ తేజ్ వరకూ దాదాపు 7 హీరోలున్నారు ఈ కుటుంబంలో. వీరందరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇకపోతే ఈ కుటుంబం నుండి ఈసారి 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పెద్ద ఎత్తున పోటీ చేయబోతున్నాడు. అదీకాక రాజకీయంగా ఆయన ఈ ఎన్నికల్లో ఏ ఇతర రాజకీయ పార్టీల అండా కోరుకోవడం లేదు.

పైగా త్వరలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నాడని కూడా తెలుస్తోంది. కాకపోతే పవన్ ఒక్కడే రెండు రాష్ట్రాలను చుట్టడం చాలా కష్టం. కాబట్టి పవన్ కు తోడుగా మెగా కుటుంబలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవిని మినహాయిస్తే ఇతర హీరోలు ఎవరన్నా క్యాంపైనింగ్ లోకి దిగుతారా అనేది ప్రస్తుతం మెగా అభిమానుల్లో ఉన్న ఏకైక అనుమానం. ఎందుకంటే గతంలో కూడా చిరంజేవి పీఆర్పీ పెట్టినప్పుడు ఆయనకు తోడుగా పవన్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ బాటలోనే ఈసారి చిరంజీవి తరువాత తాము అమితంగా గౌరవించే వ్యక్తి పవన్ కల్యాణే అని చెప్పే మెగా హీరోలు ఎవరన్నా పవన్ కు సాయపడతారేమో చూడాలి.