మేధావులు రాజకీయాలకు అందుకే దూరంగా ఉంటున్నారా…?

Tuesday, October 25th, 2016, 04:16:21 PM IST

india
ప్రస్తుతం దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులు మన దేశాన్ని శక్తి వంతంగా తీర్చిదిద్దారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకెల్తున్న భారత్ రాజకీయ రంగంలో మాత్రం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఎందరో గొప్ప నాయకులను మన దేశానికి అందించిన భారతావని నేడు సరైన నాయకులు లేక వెలవెలబోతుంది.

గతంలో ప్రజా శేయస్సుకోసం ఎందరో మేధావులు రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసెవారు. వారి ఆలోచనా విధానంతో సాగించిన పరిపాలన జనరంజకంగా ఉండేది. అప్పట్లో సంఘ సంస్కర్తలు, సాంఘిక వేత్తలు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారు, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనాన్ని కలిగించడానికి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తే, నేడు అను నిత్యం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ, సమస్యలపై గురివింద గింజంత కూడా అవగాహన లేనివాళ్లు, నేర చరిత్ర కలిగిన వాళ్లు, ప్రజా సొమ్ముతో పబ్బం గడపాలని చుసేవాళ్లు రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారు. నేటి రాజకీయాలు మేధావులను ఆకర్షించడంలో విఫలం అవుతున్నాయి. కారణం వారికి నేటి కొత్త తరం రాజకీయాలపై నమ్మకం లేకపోవడమే. స్వార్థ పర రాజకీయాలు నేడు భారతావనిని ఆవహించడమే ఇందుకు ప్రధానా కారణం అని తెలుస్తోంది.

కాని ప్రస్తుత దేశ స్థితి గతులను చూస్తే నవ భారత నిర్మాణానికి మేధావుల అవసరం ఆసన్నమైందనే విషయం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇక నైనా భ్రష్టు పట్టిన రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే, అందుకు సరైన పరిష్కారం మేధావులు రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసేలా ప్రోత్సహించడమే ఇందుకు సరైన మార్గం. నేటి రాజకీయాలకు భయపడి తమ విజ్ఞానాన్ని నాలుగు గోడల మధ్యనే నిలుపుతున్న మేధావులు, తమ విజ్ఞాన జ్యోతితో భారత్ ని ఒక తారా జువ్వలా వెలిగేలా చేసే బాధ్యత వారిపైనే ఉంది. దీనికి మనం చేయవలసిందల్లా సరైన నాయకులను ఎన్నుకొని స్వార్థ బుద్ధి గల నాయకులకు స్వస్తి చెప్పడమే…!