జగన్ తల్లి ఓటమికి కారణాలేంటి?

Saturday, May 17th, 2014, 07:20:15 PM IST


సీమాంధ్ర లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించి కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అవుదామనుకొన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆశలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహాలతో జగన్ కు చెక్ పెట్టారు. వైసీపీకి చెందిన నేతలు తమ విజయం పట్ల ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల్లో వారు ఓడి పోవటం తో జగన్ కు, ఆ పార్టీ నేతలలో తీవ్ర నైరాశ్యం ఆవహించింది. అన్నిటి కంటే జగన్ తల్లి వైయస్ విజయమ్మ విశాఖపట్నం లోక్ సభ స్దానం నుంచి పోటీ చేసి, బీజేపీ సీమాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చేతిలో 90488ఓట్ల తేడాతో ఓడిపోవటం జగన్ కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.

రెడ్డి, క్రిస్టియన్,కాపు ఓటర్లు టీడీపీకి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఉంటారని,వైయస్ సెంటిమెంట్ తో తన తల్లి సులువుగా గెలుస్తుందని జగన్ భావించారు. అంతేకాక అక్కడ తన తల్లి గెలుపు కోసం దాదాపు 300 మంది తన సొంత మనుషులను కూడా జగన్ మొహరించారు. ఇక్కడ టీడీపీ తన గెలుపుకు బీజేపీ అడ్డుపడుతుందని భావించి ,పొత్తులలో భాగంగా విశాఖపట్నం సీటును బీజేపీకి కేటాయించడం తో, ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ఉత్తరాది ప్రజలు మోడీ ప్రభావం తో బీజేపీ ఓటు వెయ్యటం, విశాఖ పరిధిలోని నియోజకవర్గ పట్టణ ఓటర్లు బీజేపీ పట్టం కట్టడం తో విజయమ్మ కు ఓటమి తప్పలేదు.

పల్లెలలో ఉండే దాదాపు 5.5 లక్షల మంది ఓటర్లు వైయస్ సెంటిమెంట్ తో తన తల్లికి పట్టం కడతారని భావించిన జగన్ ఆశలకు టీడీపీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ది మోడీ ప్రచారాలు పెద్ద దెబ్బ తీశాయి. దీంతో విజయమ్మ హరిబాబు చేతిలో 90488ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.