వైజాగ్ టాలీవుడ్‌.. భూములు కొట్టేయ‌డానికే!?

Saturday, September 1st, 2018, 11:52:40 PM IST

బీచ్ సొగ‌సుల విశాఖ ప‌రిస‌రాల్లో దాదాపు 316 ఎక‌రాల్లో భారీగా స్టూడియోల నిర్మాణానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ఇటీవ‌ల ఏపీఎఫ్‌డీసీ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌తో వైజాగ్ టాలీవుడ్ అధికారిక‌మేన‌ని అంతా భావించారు. స్టూడియోల నిర్మాణానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏవీఎం స్టూడియోస్ ద‌ర‌ఖాస్తు చేయ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్ ప్ర‌ణాళిక‌ల్లోనే ఉంద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. దీనిపై హైద‌రాబాద్‌లోని తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఓ మీటింగ్‌ని కండ‌క్ట్ చేసి బాబు ప్ర‌య‌త్నాన్ని అభినందించేసింది. అయితే ఈ సంబ‌రం ఎంతో కాలం నిల‌వ‌ని ప‌రిస్థితి.

విశాఖ టాలీవుడ్‌పై వాస్త‌వికంగా ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో ఎలాంటి చ‌ర్చ సాగుతోంది? అని ఆరాతీస్తే.. అంతా తుస్‌స్‌మ‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల్లో ఎలాంటి నీతి నిజాయితీ లేద‌ని అదంతా వ‌ట్టి గ్యాంబ్లింగ్ అని అనేస్తున్నారు. వైజాగ్‌లో అత్యంత ఖ‌రీదైన భూముల్ని కొట్టేయ‌డానికి బాబు స‌రికొత్త నాట‌కానికి తెర‌తీశారని ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లే చెబుతుండ‌డం పెద్ద షాకిస్తోంది. వాస్త‌వానికి విశాఖ న‌గ‌రంలో టాలీవుడ్ ప్ర‌తిపాద‌న, స్టూడియోల నిర్మాణం ప్ర‌తిపాద‌న‌ ఇప్ప‌టిది కాదు. ఎంతో కాలంగా ఉంది. గ‌తంలో జీవోలు ఇచ్చి, ఫిలింఛాంబ‌ర్ నిర్మాణానికి పునాది రాళ్లు వేసి దానిని తూ.తూగానే నాన్చేశారు. ఇప్పుడు కూడా ఒరిగేదేం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌లు చెబుతున్న మాట ప్ర‌కారం.. విశాఖ‌లో ఎక‌రం భూమి ధ‌ర కోట్ల‌లో ప‌లుకుతోంది. అక్క‌డ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా పూనుకుంటేనే ప‌న‌వుతుంది. సినీప‌రిశ్ర‌మ బూచీ చూపి రియ‌ల్ వెంచ‌ర్ల ప్ర‌ణాళిక వేస్తే అదంతా ఉత్తుత్తే అవుతుంద‌ని విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇక స్టూడియోలు నిర్మించాలంటే అయ్యే ఖ‌ర్చు మామూలుగా ఉండ‌దు. స్టూడియోల పేరుతో భారీ సెట‌ప్ చేయ‌డానికి 70ల‌క్ష‌ల నుంచి ఆపై ఎంతైనా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత ఒక‌రు ఉద్ఘాటించ‌డం చూస్తుంటే .. అస‌లు చంద్ర‌బాబు ఆ ప‌నిని నిజాయితీగా చేయ‌డం లేదా? అన్న సందేహాలు రాజుకుంటున్నాయి. ఇవ‌న్నీ నిజం అని చెప్పాలంటే స్టూడియోల నిర్మాణం జ‌రిగి తీరాల్సిందే. అది కూడా వెంట‌నే ఈ ప్రాసెస్‌ ప్రారంభ‌మైతేనే జ‌నం న‌మ్మే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి గాలికొదిలేసే నేత‌ల్ని న‌మ్మేందుకు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కూడా సంసింద్ధంగా లేరు. స్టూడియోలు నిర్మించి టాలీవుడ్‌ని త‌ర‌లిస్తే త‌మ జిల్లా వాసుల‌కు ఉపాధి క‌ల్పిస్తారేమో? అన్న ఆశ అక్క‌డ మొద‌లైంది. కానీ అవ‌న్నీ ప‌గ‌టిక‌ల‌లేన‌ని ఇట్టే అర్థ‌మైపోతోంది.