పవన్ కళ్యాణ్ ట్వీట్ : బాబే రంగంలోకి దిగేంత ఏం జరిగింది..!

Saturday, October 7th, 2017, 11:38:49 AM IST

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నేతల తీరుని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఎపి భవిషత్తు రాజకీయాలపై సుదీర్ఘమైన చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ ట్వీట్ గురించి చంద్రబాబు ఆరాతీసినట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం నేతలు ధృవీకరించారు. దీనితో జనసేన – టీడీపీ మధ్య బంధం గురించి కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి దూరం జరగడానికి జనసేనాని నిర్ణయించుకోవడం వలనే స్వరం పెంచుతున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ గజపతి రాజు, పితాని సత్యనారాయణ ల వ్యాఖ్యలని పవన్ ఖండించలేదు కానీ సెటైర్ మాత్రం వేశారు. ఇంత మాత్రానికే టీడీపీ – జనసేన మధ్య బ్రేక్ అప్ అయిందనే వార్తలలో నిజం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

జనసేన పార్టీ టీడీపీతో పొత్తుకు మొగ్గు చూపితే అన్నిస్థానాల్లో పోటీ చేసే వీలు ఉండదు. అంతెందుకు 50 స్థానాలలో పోటీ చేసే అవకాశం దక్కడం కూడా కష్టమే. తన పూర్తి సామర్థ్యాన్ని అంచనా వేశాక, ప్రజల్లో తమకు ఎంత బలం ఉందొ తెలుసుకున్నాక ఎన్నిస్థానాలకు పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని పవన్ ఇది వరకే తెలిపారు. ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. తమ బలం పూర్తి స్థాయిలో ఉంటె 175 స్థానాలకు పోటీ చేస్తామని లేకుంటే ఎంతవరకు బలం ఉందొ అంత వరకే చేస్తామని ప్రకటించారు. ఒక వేళ అన్ని స్థానాలకు పోటీ చేయకూడదని నిర్ణయించుకునే పక్షంలో టీడీపీ తో పొత్తుకు జై కొట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం పక్కన పెడితే ఏదో ఒక పార్టీ ఓట్లు చీలడం మాత్రం ఖాయం. దీనితో చంద్రబాబు ఆదిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన వలన అనవసర నష్టం జరగకుండా. ఈ సారికి పవన్ తమతోనే ఉండేవిధంగా శాంత పరచాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అందువలనే ఎవరైనా పార్టీ నేతలు పవన్ పై నోరు జారిగా వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మధ్య అఘాతం పెరగకముందే బాబు పవన్ కళ్యాణ్ ట్వీట్ పై ఆరా తీసి మంత్రి పీతానికి వార్నింగ్ ఇచ్చారట.