చాలా కాలంగా పెండింగ్‌లో వున్న ఏపీ ప్రజల కోరిక విశాఖ రైల్వే జోన్. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు దీనికి సౌత్ కోస్ట్ జోన్‌గా నామకరణం కూడా చేయడంతో ఏపీ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే బోర్డు తో పాటు ఇతర అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి పీయూష్ గోయెల్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13లోని ఎనిమిదవ ఆర్టికల్ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ రైల్వే జోన్‌ను ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ను రాయఘడ్కు మారుస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ, గుంతకల్లు డివిజన్లు ఎప్పటికి డివిజన్లుగానే వుంటాయని, విభజన చట్టంలోని హామీల్లో భాగంగా సౌత్ కోస్ట్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులోని ఒక భాగం విజయవాడ డివిజన్‌గా వుంటుందని, మిగిలిని నియమనిబంధనలని రైల్వే బోర్డుతో చర్చించిన తరువాత పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని ఈ సందర్భంగా పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటనకు రానున్న వేళ విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.
ఎన్నికల కోసమే మోదీ రైల్వే జోన్‌ను ప్రకటించారని, ఏది ఏమైనా ఉత్తరాంధ్రా వాసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామమని, ఈ రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర వాసుల సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.