అస్తవ్యస్తంగా విశాఖ

Monday, October 13th, 2014, 10:23:58 AM IST


విశాఖపట్నంలో హుధుద్ తుఫాను సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. విశాఖ వాసులు కనీవినీ ఎరుగని రీతిలో ఈ పెను తుఫాను ఒక్కసారిగా మీదపడింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టాన్ని అరికట్టగలిగారు. కాగా హుధుధ్ తీవ్రతకు విశాఖ విమానాశ్రయం దారుణంగా దెబ్బతింది. తుఫాను ప్రభావంగా వీచిన ప్రచండ గాలులకు విమానాశ్రయం పైకప్పులు ఎగిరిపోయి అద్దాలు పగిలిపోయాయి. ఇక రన్ వే పూర్తిగా నీట మునిగింది. అలగే మరో రెండు రోజుల వరకు ఎయిర్ పోర్టుకు జరిగిన నష్టం చెప్పలేమని, నాలుగు రోజుల వరకు విమాన రాకపోకలకు అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. హుదుద్ ప్రభావానికి నగరంలో కొన్ని భవనాలు కూలిపోగా మరికొన్ని బీటలు వారాయి. కాగా విశాఖలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై మాట్లాడుతూ తుఫాను బాధితులను ఆదుకోవాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కోరామని తెలిపారు. ఇక తుఫాను వల్ల పెను నష్టం జరిగిందని, బాదితులందరినీ ఆదుకుంటామని, అందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖకు చేరుకొని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సాధారణ పరిస్థితి నెలకోనేంత వరకు అక్కడే ఉండనున్నారు.