పొగరెక్కిన ‘పందెం కోడి’లో ముఖ్యమంత్రి ఫీచర్స్..!

Monday, December 4th, 2017, 04:29:10 PM IST

సౌత్ చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మాన్ అనగానే విశాల్ పేరు గుర్తుకు రావడం ఖాయం. ఈ పందెం కోడికి రాజకీయాలపై మక్కువ ఎక్కివగా ఉన్నట్లు గతంలోనే స్పష్టం అయింది. దానివల్ల సినిమాలపై ఫోకస్ తక్కి ప్లాప్స్ అందుకుంటున్నాడు. అయినా పరవాలేదు..ఈ పందెం కోడి పొలిటికల్ రేసులో నెగ్గుకొచ్చే లక్షణాలు ఉన్నాయని గతంలోనే ప్రశంసలు అందుకున్నాడు. సరైన సందర్భంలో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ఇదివరకే హింట్ ఇచ్చాడు. అమ్మ ఏలిన ఆర్కే నగర్ బైపోల్ కి మించిన అవకాశం రాదని అనుకున్నాడో ఏమో కానీ కూతపెడుతూ బరిలోకి దూకేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఆర్కేనగర్ అనేది ఇప్పుడు దేశంలోనే హాట్ సీట్. జయ మరణం తరువాత ఉపఎన్నిక జరుగుతుండడంతో అందరి కళ్లు ఆ వైపు అనుకోకుండా మళ్లుతున్నాయి. రెండుగా చీలిన అన్నా డీఎంకే నేతలు అమ్మ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఇంతటి రణరంగంగా మారిన ఆ చోట విశాల్ ఈమేరకు నెగ్గుకొస్తాడు ? ఇలాంటి సందేహాలు రావడం సహజం. సరైన పొలిటికల్ ఫ్లాట్ ఫామ్(రాజకీయ పార్టీ) లేకుండా విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నాడు. దీనితో అతడి గెలుపు పై సందేహాలు రావడం సహజమే. కానీ విశాల్ లక్ష్యం ఆర్కె నగర్ ఉపఎన్నిక కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మన తెలుగు పందెం కోడి భారీ లక్ష్యంతోనే ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లుగా చెప్పుకొస్తున్నారు.

నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో తనలో ఉన్న పొలిటికల్ హీట్ ని బయట పెట్టిన విశాల్ తమిళనాట పాపులర్ సెలేబ్రిటిగా మారిపోయాడు. రాజకీయంగా పాపులారిటీ పెరగాలంటే అది సరిపోదు. ఆర్కే నగర్ ఉపఎన్నికే దానికి సరైన వేదిక అని విశాల్ స్కెచ్ గీశాడు. ఈ ఎన్నికలో విశాల్ గెలిచినా ఓడినా అతడి ప్రతి కదలికనే దేశం మొత్తం చూస్తుంది. భవిషత్తులో తమిళనాడుకి ఎంతటి పెద్ద బాధ్యతలో(ముఖ్యమంత్రి) అయినా లీడ్ చేయగలనని ఈ ఉపఎన్నిక ద్వారా సంకేతాలు పంపడమే విశాల్ అసలైన ప్లాన్.