మూవీ రివ్యూ : థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ – మెరిసేవన్నీ బంగారం కాదు..!

Thursday, November 8th, 2018, 07:34:25 PM IST

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ దీపావ‌ళి కానుక‌గా ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక చారిత్ర‌క నేప‌ధ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించారు. హాట్ భామ క‌త్రినా కైఫ్‌, దంగ‌ల్ ఫేమ్ ఫాతిమా స‌నా షేక్ మెరిసిన ఈ చిత్రాన్ని.. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌ష్‌రాజ్‌ఫిల్మ్ బ్యాన‌ర్ పై ఆదిత్య చోప్రా నిర్మించ‌గా ధూమ్ -3 డైరెక్ట‌ర్ విజ‌య్‌కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 300 కోట్ల బ‌డ్జెట్, స్టార్ కాస్ట్, భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

18 వ శతాబ్ద కాలంలో బ్రిటీష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం భార‌త‌దేశానికి వ‌చ్చి మ‌న సంస్థానాల‌ను, రాజ్యాల‌ను ఆక్ర‌మించుకుంటూ ఉంటారు. ఈ నేప‌ధ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా క‌న్ను రౌన‌క్‌పూర్ అనే స్వతంత్ర్య రాజ్యంపై ప‌డుతుంది. ఈ క్ర‌మంలో బ్రిటీష్ అధికారి అయిన జాన్ క్లైవ్ (లాయిడ్ ఓవెన్‌‌) మోస‌పూరితంగా రౌన‌క్ పూర్ రాజు మీర్జాబేగ్‌ని అత‌ని కుమారుడిని చంపేసి రాజ్యాన్ని కాజేస్తాడు. అయితే రౌన‌క్ పూర్ సైన్యాధ్య‌క్షుడు ఖుదాబ‌క్ష్(అమితాబ్ బచ్చన్), మీర్జా బేగ్ కూతురు జఫీరా (ఫాతిమా సనా షేక్) ని కాపాడి తీసికెళ్ళి పోతాడు. ఆ త‌ర్వాత ఖుదా బ‌క్ష్ బ్రిటిష‌ర్ల పై తిరుగుబాటు ప్ర‌క‌టించి.. ఆజాద్ పేరుతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. దీంతో బ్రిటీష్ వారు ఖుదాబ‌క్ష్‌ని దోపిడి దొంగ‌గా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ఖుదాబ‌క్ష్‌ని ప‌ట్టుకోవ‌డానికి జిత్తుల మారిన న‌క్క అయిన‌ ఫిరంగి మల్లయ్య (ఆమిక‌ర్ ఖాన్‌)ను నియ‌మిస్తారు. దీంతో ఫిరంగి ఖుదాబ‌క్ష్ ఏర్పాటు చేసిన ఆజాద్ సైన్యంలో చేర‌తాడు. క్ష‌ణానికో రంగు మార్చే పిరంగీ త‌క్కువ స‌మ‌యంలోనే ఖుదాబ‌క్ష్ న‌మ్మ‌కాన్ని పొందిన ఫిరంగీ ఎలాంటి రంగులు మార్చాడో తెలియాలంటే ఈ సినిమాని వెండితెర పై చూడాల్సిందే.

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం చారిత్రక సినిమాలు ఎక్కువ‌గా తెర‌కెక్కుతున్నాయి. ఇక్క మ‌న జ‌క్క‌న్న రాజ‌మౌళి చెక్కిన బాహుబలి చిత్రాలు త‌ర్వాత‌ భారతీయ సినిమాలో హంగులు, ఆర్భాటాలు పెరిగాయి. అయితే ఎన్ని హంగులున్నా.. సినిమాకి కావాల్సిన అసలు కథ, కథనం బాగలేప్ప‌డు.. ఎన్నికోట్లు పెట్టినా, ఎంత‌మంది స్టార్లు ఉన్నా ఆ చిత్రం బోల్తాకొట్ట‌డం ఖాయం. ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది.
1839 లో ఫిలిప్ మీడోవ్స్ టేలర్ అనే రచయిత రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్ అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య్ కృష్ణ ఆచార్య ఘోరంగా విఫ‌ల‌మయ్యాడు. ఒక ఎంగేజింగ్ క‌థ‌ను తీసుకున్న ద‌ర్శ‌కుడు దానికి త‌గ్గ‌టు స‌న్నివేశాల్ని అల్లుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు. అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకే స‌న్నివేశాలు ఉన్నా సినిమా మొత్తం ఎమోష‌న్‌ను క్యారీ చేయ‌లేక‌పోయాడు.. ఇక అమితాబ్ పాత్ర త‌ప్ప ఈ సినిమాలో పాత్రల‌ను స‌రిగ్గా డిజైన్ చేయ‌కపోవ‌డంతో ఒక్క క్యారెక్ట‌ర్ కూడా గుర్తుండిపోయే విధంగా ఉండ‌దు. బ్యాడ్ నెరేష‌న్‌తో క‌థ‌నం అస్స‌లు ముందుకు సాగ‌దు. బారీ సెట్టింగ్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్, యాక్ష‌న్ ఎపిసోడ్స్ మీదే ఎక్కువ‌గా దృష్టి పెట్టిన ద‌ర్శ‌కుడు.. క‌థ‌నం విష‌యంలో చేసిన పొర‌పాట్లు ధ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.

ఇక ఖుదాబ‌క్ష్ పాత్రకు అమితాబ్ బచ్చన్ ప్రాణం పోశార‌నే చెప్పాలి… 76 ఏళ్ల వయసులోనూ కత్తి తిప్పుతూ యాక్షన్ సీన్లు అద్బుతహః అనిపిస్తూ అద‌ర‌గోట్టాడు. ఈ చిత్రంలో గొప్ప‌గా చెప్పుకునేది ఏమైనా ఉందంటే.. అది ఒక్క‌ అమితాబ్ పాత్ర గురించే చెప్పుకోవాలి. ఇక‌ పిరంగి పాత్ర‌లో న‌టించిన ఆమీర్ ఖాన్ న‌ట‌న చూస్తే ఇత‌నేనా దంగ‌ల్ చిత్రంలో నటించి అనిపిస్తుంది. వ‌చ్చి రాని ఇంగ్లీష్‌తో ఆమీర్ చేసిన న‌ట‌న న‌వ్వుల‌పాలు అవుతోంది. ఫిరంగి నుండి వ‌చ్చిన కామెడీ డైలాగ్స్ అయితే మ‌రీ ఛెండాలం. ఇక పాట‌ల్లో అందాలు ఆర‌బోయ‌డానికి క‌త్రినా కైఫ్‌ను తీసుకున్నార‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే రెండు పాట‌ల్లో తన స్టెప్పులతో అదరగొట్టింది. ఇక దంగ‌ల్ ఫేమ్ ఫాతిమా షేక్‌కు మరోసారి న‌టించే స్కోప్ ఉన్న‌ మంచి పాత్ర దొరిక‌గా.. ఫాతిమా న్యాయం చేసింది. ఇక‌ మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సాంకేతికంగా థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ చాలా రిచ్‌గా ఉంది. ఈ సినిమాలో మొద‌ట మార్కులంటూ ఇవ్వాల్సి వస్తే.. అది టెక్నికల్ టీమ్‌కే ఇవ్వాలి. విజువల్ ఎఫెక్స్, యాక్షన్ సన్నివేశాలలు వావ్ అనేలా లేక‌పోయినా బాగానే ఉన్నాయి. మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచడ‌మే కాకుండా స్క్రీన్ పై త‌ను ప‌డ్డ క‌ష్టం క‌న‌బ‌డుతుంది. జాన్ స్టీవార్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. నిర్మాత ఆదిత్య చోప్రా పెట్టిన ఖ‌ర్చు తెర‌పై క‌నిపిస్తుంది. ఇక చివ‌రిగా చెప్పాలంటే.. ఫస్టాఫ్‌లో కొంచెం కామెడీ, ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసిన‌ దర్శకుడు.. ఇంట‌ర్వెల్‌కి మంచి ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి చెత్త స్క్రీన్ ప్లేతో ధ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్‌ని మంచి చిత్రంగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఇక ప‌ర్‌ఫెక్ట్ స్కిప్ట్‌ల‌తో మెరుపులు మెరిపించిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌కి థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ డిజాస్ట‌ర్ అని.. దీంతో మెరిసేవ‌న్నీ బంగారం కాద‌ని తేల్చేశారు ప్రేక్ష‌క‌లు.

Rating : 2.5/5