వాళ్లిద్దరిదీ అధికార దాహం : చంద్రబాబు

Sunday, June 10th, 2018, 06:07:05 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవైపు జగన్, పవన్ లు టీపీడీ అలానే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రజలు అల్లల్లాడుతున్నారని విమర్శిస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్, జగన్ లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. నిన్న నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ జగన్, పవన్ లు ఇద్దరు కేవలం అధికార దాహంతో కేంద్రప్రభుత్వ బీజేపీతో రహస్య పొత్తులు పెట్టుకుని తమ ప్రభుత్వంపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తాము ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉంటే వారిద్దరూ మాత్రం ఎందుకలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలని అన్నారు.

తాము మానిఫెస్టోలో చెప్పినట్లు అన్ని పధకాలను ప్రవేశపెట్టామని, మిగిలిన ఒకటి రెండు పధకాలను అతి త్వరలో అమలుచేసేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయని అన్నారు. గత ఎన్నికల్లో తమ ప్రభుత్వం అన్నివిధాలా ప్రజలకు మంచి చేస్తుందని నమ్మిన పవన్ ఇప్పటికిప్పుడు మాపై ఎందుకు వున్నట్లుండి ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. ప్రతిపక్ష నేత సహా మీరు కూడా కేంద్రానికి ఎందుకు తలవంచుతున్నారు, కేంద్రం నిధులు ఇవ్వకుండా, అలానే మొదట్లో ప్రత్యేక హోదా, తరువాత ప్రత్యేక ప్యాకేజీ పేరుతో వంచించిన విషయమై మీరుందుకు ప్రశ్నించడంలేదో సమాధానామ్ చెప్పాలన్నారు. మొదట్లో తాను గత ఎన్నికల్లో పోటీ చేయలేదని, కావున ఈ ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానన్న పవన్ తమ పార్టీని గెలిపించి, తనని ముఖ్యమంత్రిని చేయండని కొత్త రాగం అందుకున్నారు అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం టిడిపి నిర్విరామంగా చేసిన పోరాటం అందరికి తెలుసునని, ఇందులో దాపరికమేమి అవసరం లేదని అన్నారు. కావున ప్రజలు ఇప్పటికైనా వారిరువురిపట్ల జాగ్రత్త వహించి రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓట్లు తో తగిన బుద్ధి చెప్పాలని కోరారు….