మంచినీటి కోసం మంచుకొండనే తెస్తున్నారు!

Monday, July 2nd, 2018, 09:11:57 PM IST

గత కొన్నేళ్ల నుండి ప్రపంచదేశాల్లో నీటి కొరత తీవ్రమవుతోంది, దీనికి ప్రధాన కారణం వర్ష ఋతువులో సగటు వర్షపాతం నమోదు అవకపోవడం ఒక కారణమైతే, మానవాళి అనుసరించే జీవన విధానాలవల్ల భూమిపై వేడిమి మరింత పెరిగి నీటి కుంటలు అధిక తాపంతో అక్కడక్కడా ఎండిపోవాడమని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే ముఖ్యంగా అరబ్బు దేశాల్లో ఇప్పటికే విపరీతమైన నీటి కొరత ఉండడంతో ఆ ప్రభుత్వాలు ప్రజలకు రాబోయే రోజుల్లో ఎటువంటి నీటి కొరత రాకుండా ఇప్పటినుండే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం రానున్న కాలంలో తమ దేశ ప్రజలు నీటి సమస్యతో ఇక్కట్లు పడకుండా ఒక అద్భుత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అదేమిటంటే అంటార్కిటికా నుండి ఏకంగా భారీ మంచుకొండలను తమ దేశానికి తరలించి, వాటిని కరిగించి ఇక్కడ తమ ప్రజలకు నీటి ఎద్దడి తీర్చేలా భారీ ప్రణాళికలు రచిస్తోంది. అత్యాధునిక సాంకేతికత, మరియు భారీ ఖర్చుతో చేపట్టే ఈ కార్యక్రమం గురించి అక్కడి స్థానిక వెబ్సైటు ఒకటి ఆ కార్యక్రమ వివరాలను తమ వెబ్ సైట్ లో పొందుపరిచింది.

నేషనల్ అడ్వయిజర్ బ్యూరో లిమిటెడ్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజక్టును అమలు పరచనుంది. ప్రాజక్టు దశలు, మరియు తద్వారా ఆర్ధిక, పర్యావరణ ప్రయోజనాలను తమ వెబ్ సైట్ లో పేర్కొనడం జరిగింది. దాదాపు 60 మిలియన్ డాలర్ల వ్యయం కానున్న ఈ ప్రాజక్టు పైలట్ దశను 2019 ద్వితీయార్ధంలో మొదలెట్టి, 2020 కల్లా ప్రజలకు మంచి నీటిని అందుబాటులోకి తేనున్నారు. అయితే ఈ ప్రాజక్టు కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, మంచు కొండలను తరలించే సమయంలో అవి విరిగి నీరుగా మారకుండా, అలానే మధ్యలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేలా అన్ని విధాలా నూతన టెక్నాలజిని వినియోగిస్తున్నట్లు తెలిపారు యూఏఈ ఉన్నతాధికారులు. 2017లో వచ్చిన ఈ ప్రాజక్టు ఆలోచన, కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టిందని, ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో పరిశుభ్రమైన నీటిని అందించాలనే తలంపుతో అక్కడి ప్రభుత్వం ఈ ప్రాజక్టును మొదలెడుతోంది….