కాంగ్రెస్ నేలెవ‌రూ నోరెత్త‌రేం?

Thursday, August 25th, 2016, 07:07:59 PM IST


గోదావ‌రి ప్రాజెక్టులకు సంబంధించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో కెసిఆర్ ప్ర‌భుత్వం చేసుకున్న ప్రాజెక్టుల ఒప్పందం నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌డ్న‌వీస్‌తో నీటి ఒప్పందం చేసుకుని ముంబయి నుండి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ హైద‌రాబాద్ బేగంపేట బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీని తూర్పార‌బ‌ట్టి త‌న‌దైన స్ట‌యిల్లో ఉతికి ఆరేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గ‌జాలు ఎవ‌రూ నోరు మెద‌ప‌క పోవ‌డం ఏమిటి? అన్న చ‌ర్చ సాగుతోంది. క‌నీసం కెసీఆర్ స‌వాల్‌ను స్వీక‌రించే వారు కూడా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందంటూ ప‌లువ‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌కు ఆవేద‌న క‌లిగించ‌లేదా? ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్న విష‌యం తెలియ‌దా?

ఇలానే అయితే 2019లో కాంగ్రెస్‌కు అధికారం ద‌క్క‌డం క‌ష్ట‌మే మ‌రి. ఇది మా మాట కాదు. జ‌నాల‌ మాట‌. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఆ ప్రాజెక్టుల ఒప్పందాలు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగాయ‌ని కెసిఆర్ ముంబాయికి వెళ్ళే ముందురోజు మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మాట‌లు నేడు ఉత్త మాట‌లే అయ్యాయి. అంత పెద్ద నేత అప్పుడు ఏమీ మాట్లాడ‌కుండా ఉన్నా బాగుండేది. అస‌లే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో కానీ, ఎంసెట్ లీకేజి వ్య‌వ‌హారంలో కాని కాంగ్రెస్‌, విప‌క్షాల‌ తీరుతో అస‌హ‌నంగా ఉన్న కెసిఆర్‌ ఇక ఊరుకుంటే లాభం లేద‌నుకున్నాడు. అందుకే బేగంపేట స‌భ‌లో కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశాడు. ఒప్పంద ప‌త్రం ఒక్క‌టి చూపినా ఇక్క‌డ నుండి నేరుగా గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నాడు. ఇంకా 40 నిమిషాలు ఇక్క‌డే ఉంటాన‌ని బ‌స్తీమే స‌వాల్ చేశాడు. పైగా ఒక్క‌టి నిరూపించినా రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌న్నాడు. అయినా కాంగ్రెస్ నేత‌ల్లో ఒక్క‌రూ స్పందించ‌రేం? అస‌లు తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా… లేదా… అన్న సందేహం క‌ల‌గ‌క మానదు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు ఉత్త మాట‌లు క‌ట్టిపెట్టి తెలంగాణ‌కు గ‌ట్టి మేలు త‌ల‌పెట్టే ప‌ని చేయాలి. ఇకముందు ప్రాజెక్టులన్నీ స‌వ్యంగా పూర్తి అయినాయంటే కెసిఆర్ సార్ గ‌ట్టిగానే ఉతికేస్త‌డు!