ఓటుకు నోటు కేసులో కొత్త పేరు!

Sunday, July 5th, 2015, 03:42:07 AM IST


ఓటుకు నోటు కేసులో ఇప్పటికే తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి అనంతరం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కాగా ఇప్పటివరకు ఎక్కడా బయటపడని ‘జిమ్మీ’ అనే వ్యక్తికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే సదరు జిమ్మీ సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. అయితే ఓటుకు నోటు కేసులో ఏ2 నిందితుడు సెబాస్టియన్ ను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు తీసుకొచ్చిన వ్యక్తే ఈ జిమ్మీ అని సమాచారం తెలుస్తోంది.

ఇక ఈ విషయాన్నీ స్టీఫెన్ సన్ తన వాగ్మూలంలో తెలుపగా, కేసు మొత్తం మీద జిమ్మీ పాత్ర ఏమిటి? అతనికి రాజకీయాలతో ఉన్న లింకులు ఏమిటో విచారించేందుకు ఏసీబీ సిద్ధపడింది. అయితే కొత్తవారికి నోటీసులు ఇచ్చే విషయంలో ఏసీబీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ముందుగా పేర్లు చెబితే వారు తగినంత జాగ్రత్త పడతారని, చివరి నిముషం వరకు పేర్లు బయటకు రాకుండా ఏసీబీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిమ్మీని విచారిస్తే ఈ కేసులో మరింత పురోగతి సాధించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్లుగా సమాచారం.