వైకాపా తెదేపా మధ్య ఓట్ల తేడా 2.06 శాతం

Sunday, May 18th, 2014, 10:24:15 AM IST


సీమాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 2.06 శాతం, కానీ ఈ స్వల్ప తేడా తెలుగుదేశం పార్టీకి వైకాప కంటే 35 అసెంబ్లీ సీట్లు అధికంగా వచ్చేలా చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్న సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు రాగా వైకాపాకి 67 సీట్లు వచ్చాయి. సైకిల్ పార్టీకి 1,33,72,862 ఓట్లు పోలవగా వైకాపాకు 1,27,71,323 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 6,01,539 ఓట్లు మాత్రమే. మొత్తం ఓట్ల శాతంలో వైకాపాకు 44.47 శాతం ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 46.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ స్వల్ప తేడా తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది. చాలా అసెంబ్లీ స్థానాలలో ఈ పార్టీల అభ్యర్ధులు స్వల్ప మెజారీటీలతోనే గెలిచారు.

మంగళగిరి అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కేవలం 12 ఓట్ల మెజారిటితో గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఇదే అత్యల్ప మెజారిటి సాధించిన స్థానం. వేయి కంటే తక్కువ ఓట్ల మెజారిటితి వైకాపా 6 స్థానాలలో గెలిస్తే తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలలో గెలుపొందింది. ఇలా చాలా స్థానాలలో ఆ రెండు పార్టీల మధ్య చాలా స్వల్ప మెజారీటీలు మాత్రమే నమోదయ్యాయి. ఏదైతేనేం ఒక్క ఓటు కూడా ప్రభుత్వాలను తారుమారు చేయగలదు.