అరాచ‌కీయుల‌కు శ్రీ‌రాముని దీవెన‌లు!

Friday, April 15th, 2016, 11:34:16 AM IST

srirama-navami
శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు. నిత్యం రాజ‌కీయాల్లో మునిగి ఏ పార్టీని ఎలా కుప్ప‌కూల్చాలి? ఏ శ‌త్రువుని ఎలా మ‌ట్టుబెట్టాలి? అని ఆలోచించే మ‌న నేత‌లంద‌రికీ ప్ర‌త్యేకించి శ్రీ‌రాముని త‌ర‌పున శుభాకాంక్ష‌లు. అనునిత్యం కుటిల రాజ‌కీయాల‌తో అప్ర‌శాంత మ‌న‌స్కులుగా జీవించే మ‌న అరాచ‌కీయ నేత‌లంద‌రికీ ప్ర‌త్యేకించి శ్రీ‌రాముని దివ్యాశీస్సుల‌తో ఈ ఒక్క‌రోజుకైనా ప్ర‌శాంత‌త మిగ‌లాల‌ని ఆకాంక్షిస్తూ…..

చంద్ర‌బాబూ .. చంద్ర శేఖ‌రా .. అస‌లే బ‌లహీనంగా ఉన్న పార్టీల నుంచి ఎమ్మెల్యేల్ని ఆక‌ర్షించొద్దు ప్లీజ్‌! మాట విన‌కుంటే శ్రీ‌రామునిపై ఆన‌!! నిష్క‌ల్మ‌ష‌మైన మ‌న‌సుతో పొరుగు వాడు సైతం బావుండాల‌ని కాంక్షించు. దేవుని గుడికి వెళ్లి దేవుడా నువ్వు బావుండు! నువ్వే బావుండు.. అని శ్రీ‌రాముని మొక్కండి ప్లీజ్‌. `ఎప్ప‌టిలానే నేనే బావుండాలి. నావాళ్లే బావుండాలి!` అని మొక్కితే దేవుడు క‌నిక‌రించ‌డు. ధేధీప్య‌మానంగా వెలిగిపోతున్నాయ్‌.. అని అనుకుంటున్న మీ పార్టీల్నే గంగ‌లో క‌లిపేస్తాడు. ఊహించ‌ని రీతిలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొత్త పార్టీల్ని, ఇప్పుడిప్పుడే ఎదిగేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న న‌యా పార్టీల్ని ఆ శ్రీ‌రాముడు ఆశీర్వ‌దించి గెలిపించేయ‌గ‌ల‌డు.

అయ్యా జ‌గ‌న్మోహ‌నా.. ఇన్నిరోజులు `బాబు`ను ఆడిపోసుకుంటే ఆడిపోసుకున్నావు గాక‌! ఇప్ప‌టికైనా శాంతించ‌వయ్యా.. శ్రీ‌రాముని పూజ‌ను మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా మ‌న‌సు పెట్టి ఆచ‌రించు. దివ్య ఫ‌లాల్ని ఆశించు. కార్య‌సాధకుడివి. ధైర్యం ఉన్న‌వాడివి. 2019 నాటికి ప‌రిస్థితుల్ని సానుకూలంగా మారాలంటే కాస్తంత రాజ‌కీయంతో పాటు భ‌క్తి, ముక్తి మార్గ‌మును అన్వేశించు. చంద్ర‌బాబును ఈ ఒక్క‌రోజుకైనా వ‌దిలెయ్‌.

ఓ చంద్ర‌శేఖ‌రుడా.. అస‌లే తెలంగాణ‌లో తేదేపా నేల‌మ‌ట్టం అయ్యింది. నీతిమంతుడివైన నువ్వే మ‌ట్టానికి తొక్కేస్తున్నావ్‌! చాలించ‌వ‌య్యా నీ దుందుడుకు..!! ఒక పార్టీని పాతాళంలోకి తొక్కేసి నువ్వు బావుకునేదేముంది? అందుకే ఈ ఒక్క‌రోజుకి చేసిన పాపాల్ని క‌డిగేసుకోలేక‌పోయినా.. క‌నీస మాత్రంగానైనా శ్రీ‌రాముని దీవెన‌లు అందుకో. బెల్లం, మిరియాల పొడితో పాన‌కం తాగి అటుపై దేహ‌శుద్ధి గావించుడు. ఆంధ్రా నుంచి టి-ప్ర‌పంచంలో అడుగుపెట్టిన అర‌టి ఆకులో భోజ‌నం చెయ్‌. మ‌న‌స్సు శాంతించును. ఇక మీ మిత్రుడైన జ‌గ‌నుడికి ఇదే ఉప‌దేశం చెయ్‌. రామోజీ, మోదీల‌తోనూ చెలిమి చేశావ్‌. వారితోనైనా కాస్త శ్రీ‌రామ న‌వ‌మి గొప్ప‌త‌నాన్ని, ప్ర‌స్థానాన్ని షేర్ చేసుకో.

ఇక స‌ర్దార్జీ, జ‌న‌సేన నేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ లో ఓ ఆధ్యాత్మిక జీవి ఉన్నాడు గ‌నుక‌.. శ్రీ‌రాముని దివ్య ఆశీస్సులు ఎలానూ ఉంటాయ్‌. ప్ర‌జ‌లే దేవుళ్లుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని అర్థం చేసుకుని, విస్ర్త‌తంగా ప‌ర్య‌ట‌న‌లు గావించి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గెలుపు గుర్రం ఎక్కాల‌ని శ్రీ‌రాముని మొక్కుకో స‌ర్దార్జీ. ఇక ప‌నిలో ప‌నిగా అన్న‌య్య చిరంజీవి 150వ సినిమాని వెంట‌నే ప్రారంభించేలా రామ‌బంటు హ‌నుమంతునిలా న‌డుచుకో. ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ నుంచి అన్న‌య్య `జ‌న‌సేన‌` ప‌గ్గాలు చేప‌ట్టేలా స‌రికొత్త రాజ‌కీయ ర‌ణ‌తంత్రం ర‌చించు.

మోదీజీకి మ‌న్మోహ‌న్‌తో స్నేహం కుద‌రాలి. అమెరిక‌న్ డొనాల్డ్ ట్రంప్‌తోనూ చెలిమి కుద‌రాలి. భ‌విష్య‌త్ లో సంకీర్ణ ప్ర‌భుత్వాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు రావాలి. సోనియా, రాహుల్ .. మోదీని స్మ‌రించిన‌ట్టే శ్రీ‌రాముని స్మ‌రించాల‌ని ఆకాంక్షిస్తూ .. మ‌రోసారి అంద‌రికీ శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు.