బాబు చేతికి మెట్రో ప్లాన్!

Monday, April 27th, 2015, 02:20:18 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రణాళిక అందింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఎండీ శ్రీధరన్ ఈ నివేదికను బాబుకు అందజేశారు. ఇక 2019కి పూర్తయ్యే లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టుకు మొత్తం 6,823కోట్ల రూపాయల వ్యయం అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు కారిడార్లలో ఏర్పాటు కానున్న ఈ మెట్రోలో ఒకటి 12.76కిలోమీటర్ల పొడవుతో రాజధాని నగరం అమరావతిని కలుపగా, మరొకటి 13.27కిలోమీటర్ల పొడవుతో గన్నవరం విమానాశ్రయాన్ని కలపనున్నట్లు తెలుస్తోంది.

కాగా మెట్రో నిర్మాణానికి మొత్తం 31.029 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉందని శ్రీధరన్ తెలిపారు. అలాగే 5కిలోమీటర్ల దూరానికి 10రూపాయలు, 10కిలోమీటర్ల లోపు 20రూపాయలు, ఆపై 30రూపాయల టికెట్ చార్జీలు వసూలు చెయ్యాల్సి ఉంటుందని శ్రీధరన్ వివరించారు. ఇక మెట్రో నిర్మాణానికి కిలో మీటరుకు 209కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని శ్రీధరన్ స్పష్టం చేశారు.