రివ్యూ రాజా తీన్‌మార్ : నా పేరు సూర్య – కోపమెక్కువ.. కంటెంట్ తక్కువ

Friday, May 4th, 2018, 03:19:08 PM IST

 

 

 

తెరపై కనిపించిన వారు : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్
కెప్టెన్ ఆఫ్ ‘నా పేరు సూర్య’ : వక్కంతం వంశీ

మూల కథ :
దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ చనిపోవాలనే కోరిక కలిగిన సైనికుడు సూర్య (అల్లు అర్జున్) ఆవేశం కారణంగా ఆర్మీ నుండి బయటకు పంపివేయబడతాడు. తిరిగి ఆర్మీలోకి రావాలంటే ఇండియాలోనే ప్రముఖ సైకియాటిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) పర్యవేక్షణలో ఉండి, అతనిచేత అన్ని విధాల ఫిట్ గా ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మని చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు.

అలా సర్టిఫికెట్ కోసం రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య తన ప్రవర్తనను ఎలా మార్చుకున్నాడు, రామకృష్ణంరాజు, సూర్యల మధ్య లింక్ ఏంటి, చివరికి అందరికీ నచ్చినట్టు సూర్య మారాడా లేదా అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :
→ మొదటి విజిల్ అల్లు అర్జున్ కే వేయాలి. ఎందుకంటే అతి కొంపం, ఆవేశం కలిగిన సైనికుడిగా ఆయన నటన చాలా బాగుంది. సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్ చాలా వరకు బన్నీనే అని చెప్పాలి. ఆయన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ మనకు కొత్త బన్నీని చూపిస్తుంది.

→ ఇక స్వతహాగా రచయిత అయిన దర్శకుడు వక్కంతం వంశీ సూర్య పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. ఆ పాత్ర వ్యక్తిత్వం, జర్నీ అన్నీ ఆకట్టుకున్నాయి. కాబట్టి రెండో విజిల్ ఆయనకు వేయవచ్చు.

→ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశాల్లో యాక్షన్ సన్నివేశాలు ముఖ్యమైనవి. ఆరంభం నుండి చివరి వరకు వచ్చే ప్రతి ఫైట్ థ్రిల్ చేసింది. అందుకే మూడో విజిల్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కిచ్చలకి వేయవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→ ఫస్టాఫ్ వరకు భాగనే అనిపించిన ఈ చిత్రం ద్వితియార్టానికి చేరుకునే సరికి పూర్తిగా మారిపోయి వేరే దిశగా నడుస్తూ పోతుంది. దీంతో ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు నిరుత్సాహం తప్పదు.

→ ఇక సినిమా క్లైమాక్స్ కూడ ఏమంత గొప్పగా లేదు. దీంతో చివర్లో ఒక స్టార్ హీరో సినిమా చూశామన్న ఫీలింగ్ మిస్సవుతుంది.

→ ప్రతినాయకుడు బలంగా లేకపోవడం, హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోకడంతో సినిమాలో కమర్షియల్ అంశాలు లోపించాయి.
దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.
→ ఈ సినిమాలో ఆశ్చర్యపోయే విధంగా ఎలాంటి సన్నివేశాలు, సంఘటనలు లేవు.

సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : అల్లు అర్జున్ మాత్రం అదరగొట్టాడు.
మిస్టర్ బి : అవును.. యాంగ్రీ సోల్జర్ గా భలేగా సెట్టయ్యాడు స్క్రీన్ మీద.
మిస్టర్ ఎ : కానీ సెకండాఫ్ కంటెంట్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
మిస్టర్ బి : అవును.. సూర్యకి కోపమెక్కువ..సినిమాకి కంటెంట్ తక్కువ అన్నట్టుంది పరిస్థితి.