రేవంత్ రెడ్డి ఒక గాలి నాయకుడు : కాంగ్రెస్ గెలవడం అసాధ్యం!

Tuesday, August 28th, 2018, 02:07:41 AM IST

టిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ సందర్భంగా మొన్న అధినేత కేసీఆర్ తో ఎమ్యెల్యేలకు జరిగిన సమావేశంలో కోట్లరూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రేవంత్ పై మండిపడుతున్న టిఆర్ఎస్ నాయకులు, ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, రేవంత్ ఏమి ఆశించి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరారో అందరికి తెలుసునని విమర్శిస్తున్నారు. ఇక నేడు టిఆర్ఎస్ ఎమ్యెల్సీ కర్నె ప్రభాకర్ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక గాలి పార్టీగా తయారయిందని, కాంగ్రెస్ నేతలు తమ పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడితే మరొక్కసారి ప్రజలు వారికీ గట్టిగా బుద్ధి చెప్పగలరని అన్నారు.

ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అసలైన గాలి నాయకుడని, తమ పార్టీపై అనవసర నిందలు వేస్తూ కాంగ్రెస్ పార్టీ తమకున్న కొద్దోగొప్పో ప్రతిష్టని కూడా పూర్తిగా దిగజార్చుకుంటోందని అయన అన్నారు. ప్రగతి నివేదన సభకు ఎమ్యెల్యేలకు డబ్బులు ఇచ్చారు అనడం అన్యాయమని, తమకు గాని తమ అధినేతకు కానీ అవినీతి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్ముని నమ్ముకుంటే, మేము ప్రజలను నమ్ముకుని అధికారంలోకి వచ్చామని, ప్రగతి నివేదన సభకు వెల్లువలా తరలిరావాలని ఎదురుచూపులు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నోటికొచ్చినట్లు పేలుతున్నారని,

అఖిలపక్షం పేరుతో ఉత్తమ్ ఏదిపడితే అది మాట్లాడుతున్నారని, అసలు నిజానికి ఆయనకు గోదావరిలో నీటి లభ్యత ఎంతో కూడా తెలియదని, అటువంటి నేతలు మనతో ఉండడం మన దురదృష్టమని అయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు అధికారం వస్తుందని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని, అసలు ప్రజలు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితుల్లో లేనేలేరని, వారి హయాంలో రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకుతిన్నారో అందరికి తెలుసునని, కాబట్టి కాంగ్రెస్ నేతలు ఎప్పటికి తెలంగాణాలో అధికారాన్ని చేపట్టే అవకాశమే లేదని అన్నారు ….