బౌన్సర్ గా పనిచేసినోడికి పవన్ తో పోటీనా?

Saturday, May 9th, 2015, 03:45:18 AM IST

revanth-reddy
తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక రేవంత్ మాట్లాడుతూ తలసాని స్థాయికి మించిన వ్యాఖ్యలు చేసి తెరాస పార్టీలో పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాజకీయాలలోకి రాకముందు తలసాని సినీ నటుడు మోహన్ బాబు సినిమా షూటింగుల దగ్గర బౌన్సర్ గా పనిచేసేవారని రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తలసాని ప్రస్తుతం అనుభవిస్తున్న హోదా వెనుక తెలుగుదేశం పార్టీ పెట్టుబడి, రక్తం, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తలసానికి గనుక సిగ్గు, శరం ఉంటే తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పదవికి రాజీనామా చెయ్యాలని నిప్పులు చెరిగారు. ఇక బౌన్సర్ గా పనిచేసిన తలసాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పోటీకి రమ్మనడం హాస్యాస్పదమని, చేతనైతే గెలుపొందిన సీటుకు తలసాని రాజీనామా చేసి తరువాత అతను ఎంత గొప్ప నాయకుడో నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.