ఎంపీగారి షాపింగ్ అయ్యేంతవరకు ఆగిన విమానం!

Tuesday, February 24th, 2015, 10:00:21 PM IST


పవర్ అండ్ పాలిటిక్స్ తో దేన్నైనా మార్చవచ్చని నిరూపించేలా ఢిల్లీ విమానాశ్రయంలో ఒక సంఘటన జరిగింది. కాగా ఒక ఎంపీగారి షాపింగ్ పూర్తయి వచ్చే వరకు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే విమానం దాదాపు 45నిముషాలు వేచి చూసింది. ఇక వివరాలలోకి వెళితే కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి షాపింగ్ లో బిజీగా ఉండడంతో ఎయిర్ ఇండియా విమానం దాదాపు 45 నిముషాలు పడిగాపులు కాసింది. కాగా శనివారం సాయంత్రం షికాగో నుండి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం 7గంటలకు బయలుదేరాల్సి ఉంది.

అయితే విమానం ఎంతకీ బయలుదేరకపోవడంతో ఒక ముఖ్య ప్రయాణికురాలు రావాల్సి ఉందని విమాన సిబ్బంది ప్రయాణికులకు చెప్తూ వచ్చారు. ఇక చివరి అనౌన్సుమెంట్ పూర్తయ్యాక కూడా రేణుక రాకపోయేసరికి, ఆరా తీయగా ఆమె షాపింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలిసింది. కాగా లగేజీ కూడా తనిఖీలు పూర్తి చేసుకుని విమానంలోకి చేరడంతో ఎయిర్ ఇండియా సిబ్బందికి రేణుక వచ్చేంత వరకు విమానం ఆపాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఇక విమానంలో ప్రయాణికులతో పాటు ఒక కేంద్రమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి కూడా రేణుక కోసం ఎదురు చూడాల్సి వచ్చిందట. కాగా ఈ సంఘటనపై ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారులకు పిర్యాదు కూడా చేశారట. అయితే రేణుక మాత్రం విమానాశ్రయం నుండి విమానం వద్దకు తీసుకు వచ్చే బస్సు ఆలస్యం అయినందునే లేట్ గా వచ్చానని, షాపింగ్ కారణం కాదంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.