పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి!

Tuesday, February 24th, 2015, 09:01:13 AM IST


ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కొల్లం గంగిరెడ్డి ఎట్టకేలకు నిన్న మారిషస్ ఎయిర్ పోర్టులో ఇంటర్ పోల్ అధికారుల చేతికి చిక్కాడు. కాగా కడప జిల్లా పుల్లంపేటకు చెందిన గంగిరెడ్డి తొలుత రౌడీయిజం చేసి అటుపై రాజకీయ అండతో అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగాడు. ఇక కడప జిల్లాలో గంగిరెడ్డిపై రౌడీషీట్ కూడా ఉంది.

కాగా మొదట సొంతూరులో రౌడీయిజంతో మొదలు పెట్టిన గంగిరెడ్డి ప్రస్థానం అనంతరం కాంగ్రెస్ నేతలతో పరిచయాల నేపధ్యంగా తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని తెరపైకి తీసుకువచ్చి రాజకీయ అండతో అంచలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్మగ్లింగ్ స్థాయికి చేరుకున్నాడు. ఇక శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించి కోట్లలో ధనం కూడబెట్టాడు. అలాగే స్మగ్లింగ్ చేస్తూ కర్నూలు పోలీసులకు పట్టుబడినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చిన గంగిరెడ్డి తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు పసిగట్టి విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలోనే మారిషస్ నుండి శ్రీలంకకు వెళుతూ ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు పట్టుబడ్డాడు.