‘చిరు’ డుమ్మాకు కారణం?

Thursday, May 14th, 2015, 05:44:23 PM IST


హైదరాబాద్ ఇందిరా భవన్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేడు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరై కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం సేకరించిన కోటి సంతకాలను రాష్ట్రపతికి ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 26న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8న భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో పాటు పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్, చింతా మోహన్ లు గైర్హాజరు అయ్యారు.

ఇక చిరంజీవి ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. అయితే నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్న సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎన్నో విమర్శలను ఎదుర్కున్నారు. అటుపై యూపీఏ సర్కరులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిరంజీవి, 2014ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో కొంత నిరాశకు లోనయ్యారు.

ఇక రాజకీయ జీవితంపై విరక్తి కలిగిందో ఏమో చిరు మరలా హీరోగా 150వ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు చిరు తనయుడు, ప్రముఖ యువ నటుడు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నాడని విమర్శలు అందుకుంటున్న చిరు నేటి విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టడంతో సినిమా బిజీతో హాజరు కాలేదా? లేక కావాలనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్తున్నడా? అని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.